7.ముహూర్తమునకు గ్రహగతులే ముఖ్యమా!

మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహుర్త భాగములో ఒకొక్క భావము పర్టిక్యులర్గా శుద్ధిగా ఉండాలని ఉంటుంది. అలాగే ఆ కార్యానికి సంబంధించిన కారక గ్రహములు భావాధిపతులు లగ్నస్థితి ఇవన్ని డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి. ముహూర్తాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అలాగే కార్యాన్ని బట్టి తారలను ఎంచుకొనవచ్చు. కొన్ని సందర్భాలలో క్షేమతార, కొన్ని సందర్భాలలో సాధనతార, కొన్ని సందర్భాలలో మిత్రతార, తీసుకుంటాము. అలాగే చంద్రబలాన్ని కూడా భేరీజు వేసుకుంటాము. ఒకాయన ముహూర్తానికి ప్రత్యకార లేదా విపత్తార ఉంది ఎలా అంటాడు. ఎదో ఊహించేయటమే. ముహూర్తమునకు స్వక్షేత్రగతుడయి ఉన్న చంద్రునివలన విపత్తార, ప్రత్యక్ తారల దోషములు హరించును. మరియు విపత్తార, ప్రత్యక్ తారలకు చంద్రబలము బాగున్నచో తార దోషము పరిహారము అగును. అందుచేతనే వివాహాది శుభముహూర్తములకు తారాబలముకన్నా చంద్రబలమే ముఖ్యముగా చూచెదరు. అట్లుకానప్పుడు ప్రథమనవకంలో జన్మతార ద్వితీయ నవకంలో విపత్తార, తృతీయ నవకంలో ప్రత్యక్ తార మూడు నవకములందు నైధనతార నిషిద్ధము. మిగతా నవకములలో ముహూర్తము పెట్టవచ్చును. అయినప్పటికి తప్పని పరిస్థితులలో జన్మతార ఏడు ఘడియలు విపత్తార మూడు ఘడియలు ప్రత్యక్ తార ఎనిమిది ఘడియలు వదలి మిగతా ఘడియలలో ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ స్వల్పదోషశాంతికి పెండ్లి కుమార్తె లేదా పెండ్లి కుమారునికి గాని జన్మ తారకు శాకదానము (గుమ్మడి పండు) విపత్తారకు బెల్లము, ప్రత్యక్ తారకు ఉప్పు దానము ఇచ్చి వివాహాది శుభకార్యములు జరుపవచ్చును. మరొక ఆయన ఫలానా ముహూర్తానికి రాహుకాలము ఉందంటాడు. ఇంకోఆయన శనిహోర యమ గండం ఉందంటారు. ఒకాయన అయితే ఇంకేముంది చక్రంలో కుజుడు వ్యయంలో ఉన్నాడు అంటాడు. ఎవరికి వారు ఏదో ఊహించేసుకుని గందరగోళం పడితే ఎలా? అసలు ముహూర్తానికి ఆ నక్షత్రమేమిటి? ఆ రాశి ఏమిటి? ఆ లగ్నమేమిటి? ఆధిపత్యమేమిటి? గురుశుక్రుల పొజిషను ఏమిటి? చూసుకోవాలి కదా. ముహూర్తానికి లగ్నము గ్రహ గతులే ముఖ్యము. మరొకాయన చవితి రోజున ముహూర్తమేమిటి? అంటారు. చవితి, షష్టి, అష్టమి తిథులలో కూడా వివాహాది శుభ కార్యాలు జరుపుతూ ఉంటారు. తిథివారనక్షత్ర లగ్నములను పరిశీలించి పంచక రహితమయిందేమో చూసుకోవాలి. ముహూర్త సమయమున శనిహోర, రాహుకాలము, యమగండకాలము ఇవి ఏకవింశతి మహా దోషములందు చెప్పబడలేదు. కనుక వాటిని మన ప్రాంతీయమువారు ఆచరించే సాంప్రదాయము లేదు. మరియు యజ్ఞము, దేవతార్చనలు, దానధర్మములు, నిత్యకార్యములకు వర్ణ దుర్ముహూర్తాదులను చూడక ముందుకు సాగవచ్చును. ఒకవ్యక్తికి గవర్నమెంటు ఉద్యోగం వచ్చినది. అమావాస్య, మంగళవారము జాయిను అవమన్నారు. ఏమి చేస్తాము? తప్పదు. మనఃసంకల్పముతో భగవంతునిమీద భారము వేసి ముందుకు వెళ్లి ఆనందముగా రిటైర్ అయినవాళ్లు చాలామంది ఉన్నారు. కాలమే భగవంతుడు. అందున మన పని నిర్వహణ కార్యదీక్షలో భగవంతుని చూడాలి. ముహూర్తమన్నది ఒక షెడ్యూలు లాంటిది. టైము ఇంపార్టెన్సిని తెలియచేసేది. మనలో కార్యదీక్ష, చైతన్యము, ఉత్సాహమును ఇచ్చి సకాలములో కార్యమును పూర్తి చేయటానికి నియమితమైనదే ముహూర్తముగా చెప్పబడుతున్నది. గృహప్రవేశమునకు ముహూర్తమును పెడుతున్నాము. (అక్కడ ఖగోళ చక్రాన్ని చూపిస్తున్నాము) కాదనము అంతరార్ధము ఏమిటంటే ఆ ముహూర్త సమయమునకు ఈ చేపట్టిన పని అవ్వాలని కృషి చేయుటకు, అదేలేనట్లయితే ఈ ప్రపంచము ఇంత అభివృద్ధికే రాదు. అన్ని వాయిదాలే. అంతేకాని ఆ ముహూర్త సమయము మాత్రమే గొప్పదనే భావముతో ఆ ముహూర్త సమయములను ఆదమరపులో దాటపెట్టుకొని బాధ పడవలసిన అవసరము లేదు. దోషములేని ముహూర్తము బ్రహ్మతరముకూడా కాదని అంటారు. ఇక్కడ అన్నిటికి ఒకటే సూత్రం అనుకొని ముహూర్తకాల చక్రాన్ని జాతక చక్రమువలె పరిశీలించుట కూడ సమంజసము కాదు. అప్పుడు ముహూర్తమే కనిపించదు. ఒక జాతకుడు అమావాస్యరోజున పుడతాడు. పెద్ద పొజిషనుకి రావచ్చు. అలా అని అమావాస్య రోజున ముహూర్తము పెట్టము కదా. ముహూర్త చక్రమువేరు. జాతక చక్రాదులు వేరు. పంచాగ కర్తలు మంచి ముహూర్తాదులను పొందుపరచినప్పటికి శుభకార్యములను జరుపుకొనేవారు ఎవరికి వారు ఏదో వూహించేసుకుని మంచి సంకల్పము భావము లేకుండా కార్యాచరణ చేయుట సమంజసము కాదు.

1. వివాహమైన పదహారు రోజులలోపు వివాహ విషయాది తంతులకు ముహూర్తము లకు తిథివారనక్షత్రాదులను చూడనవసరము లేదు.

2. నెలపట్టిన (ధనూ సంక్రాంతి) మార్గశిర మాసమునందు కార్తీక మాసమునందు కూడా వివాహాది శుభముహూర్తములు జరుపవచ్చును. ఉపనయనము తప్పనిసరి పరిస్థితులలో

3. గ్రహబలములను గమనించుకొని లగ్నబలమును చూసి పుణ్యక్షేత్రము లందు నిర్వహించు కొనవచ్చును. అభిజిత్ లగ్నము : సూర్యుడు ఉదయించుచున్న లగ్నమును ఉదయ లగ్నమని ఉదయ లగ్నమునుంచి నాలుగవ లగ్నమును అభిజిత్ లగ్నము అందురు. ఇది సర్వదోషములను నశింపజేయును. అన్ని వర్ణములందును ఉపనయనము గర్భా దానము మినహా మిగిలిన అన్ని శుభకార్యములకు శుభ ప్రదము. లగ్న బలముచే లగ్న గురునిచే దోషములు ఎలా హరించునో అదే అభిజిత్ లగ్నమయినచో సర్వదోషములను హరించును. మిట్టమధ్యహాన్న సమయమున వచ్చు ఈ అభిజిత్ లగ్నమును సర్వకార్యములకు ఆచరించవచ్చును.

4. గోధూళికా లగ్నము : సూర్యోదయ కాల లగ్నమునకు ఏడవ లగ్నమును గోధూళికా సమయము అందురు. అంటే పశు సంపద ఆవులు తమ నివాసమునకు చేరు సమయము. ఈ సమయముకూడ సర్వకార్యములకు శుభప్రదమని ప్రయాణమునకు కూడా వారశూలలతో సంబంధము లేకుండా శుభప్రదము.

5. శన్యూషః కాలము : శనివారము ఉదయము సూర్యోదయమునకు ముందు (నలుబది నిమిషములు) గల సమయమును శన్యూషః కాలము అందురు. ఈ సమయమునందు ఏ పని ప్రారంభించినను శుభప్రదము. ప్రయాణమునకు కూడ శుభప్రదము.

6. శంఖుస్థాపన జరిపిన పిదప గృహ విషయాది ఇతర పనులు ద్వారబందమును ఏర్పరుచుట, స్లాబును వేయుట, రెండు, మూడు ఫ్లోరులు వేయునపుడు ఇత్యాది విషయములకు ముహూర్తములు చూడనవసరము లేదు. శంఖుస్థాపన ముహూర్తము తదుపరి గృహప్రవేశ ముహూర్తమునకే మనము ప్రాముఖ్యత ఇవ్వవలెను.

7. ముహూర్తమునకు చంద్రుడు జన్మ తారయై, లగ్నయుక్తుడై ఉన్నప్పటికి శుభగ్రహ వీక్షితుడు అయినను, కేంద్రములందైనను, స్వోచ్ఛ, మూల త్రికోణములందు ఉన్నను, లగ్నాత్ లగ్నము లగాయతు ఉపచయస్థానములందును మూడు, ఆరు, పది, పదకొండు భావములందు ఉన్నను దోషపరిహారము అయి శుభదాయకము అగును.

8. ముహుర్తమునకు గురు, శుక్ర, బుధుడు లగ్నమునందు ఉన్నను లేదా గురు, శుక్ర, బుధుడు లగ్నమునకు కేంద్రములందు ఉన్నచో అట్టి ముహూర్తము దోషరహిత మైనదిగా చెప్పబడును.

9. ముహూర్తమునకు గురుడుకాని, శుక్రుడుకాని కేంద్రములందును పాపగ్రహములు 3, 6, 11 స్థానములందు ఉన్నను అట్టి ముహూర్త లగ్నమునకు తిథివార నక్షత్రయోగ దోషములు హరించబడును.

10. ముహూర్తమునకు రవి ఏకాదశ స్థానమున ఉన్నను నైసర్గిగ శుభులు కేంద్ర కోణములందు అనగా 1, 4, 10, 5, 9 స్థానములందు ఉన్నను సకల దోషములు హరించవేయబడును.

11. అష్టదోషములు ఐన అబ్దదోషము, ఆయన దోషము, ఋతు దోషము, మాసదోషము పక్షదోషము, తిథిదోషము, నక్షత్రదోషము, దగ్గాది యోగదోషములు ఉన్నను ముహూర్త లగ్నమునకు కేంద్రములందు 1, 4, 10 శుభ గ్రహములు ఉన్నచో దోష పరిహారము అగును.

12. ముహుర్తమునకు చంద్రుడు షష్టాష్టమ వ్యయస్థానములందు ఉన్నప్పటికి అట్టి చంద్రుడు నీచ రాశి గతుడు అయినను లేదా నీచాంశలో ఉన్నను దోషము పరిహారము అగును.

13. ముహూర్తమునకు అష్టమ కుజదోషము ఉన్నను అట్టి కుజుడు అస్తంగతుడు అయినను, శత్రు క్షేత్రములందు ఉన్నను దోష పరిహారము అగును.

14. ముహూర్తమునకు షష్ట శుక్రుడు దోషము అయినప్పటికి అట్టి శుక్రుని స్థానము నీచమైనను లేదా శత్రుక్షేత్రము అయినను దోషము పరిగణలోనికి రాదు.

15. వివాహ లగ్నమునకు ద్వి, ద్వాదశములందు క్రూరగ్రహములు ఉన్నట్టి కర్తరీ దోషమునకు ఆ క్రూరగ్రహములు అస్తంగతమై ఉన్ననూ నీచస్థానములై ఉన్నను శత్రు క్షేత్రగతులు అయినను లేదా కేంద్ర కోణములందు 1, 4, 5, 9, 10 స్థానములందు గురు, శుక్రులు ఉండినను లగ్నకర్తరీ, చంద్రలగ్న కర్తరీ దోషములు నివారించ బడును. ముహూర్తమును ముందుకు నడిపించ వచ్చును.

16. ముహూర్తమునకు రాత్రియందు రోగ-చోర పంచకములు ఉన్నను, పగటి యందు రాజ-అగ్ని పంచకములు ఉన్నను రెండు సంధ్యలయందును మృత్యు పంచక దోష భూయిష్టములు. రాత్రియందు రాజ, అగ్ని పంచకములు పగటియందు రోగ, చోర పంచకములు అనుసరించ వచ్చును.

17. జన్మ నక్షత్రములందు చేయకూడనివి : పుంసవనము, సీమంతము, యుద్ధము, గర్భాదానము, శ్రాద్ధ కర్మ, క్షుర కర్మ, ఔషధ సేవ, ప్రయాణము, ఋణము, నూతన వ్యాపారము, ప్రభు సన్మానము, స్నేహము, రాచకార్యములు, వివాహము కూడవు. జన్మ నక్షత్రములందు స్త్రీలకు వివాహము పురుషులకు ఉపనయనము జరిపించ వచ్చును.

18. జన్మ నక్షత్రమునందు చేయవలసిన పనులు : నిషేకము, యజ్ఞము, చౌలకర్మ, అన్నప్రాసనము, ఉపనయనము, వ్యవసాయము,ఉద్యోగము, పట్టాభిషేకము, విద్యారంభము, అక్షరాభ్యాసము, భూ సంపాదన (రిజిస్ట్రేషన్) లు చేయవచ్చును.

19. వివాహానంతరము చేయతగని పనులు : కుటుంబములో వివాహము అయిన ఆరుమాసములవరకును చెవులు కుట్టుట, నూతన గృహ ప్రవేశము, తీర్థ యాత్రలు, నూతన వ్రతములు, వ్రత ఉద్యాపనలు చేయరాదు.

20. గృహారంభము చేసినతరువాత గృహప్రవేశము అయ్యేవరకు ఏ శుభకార్యములు చేయరాదు. గృహప్రవేశానంతరము శుభ కార్యములు చేయవచ్చును. ఉపనయనము చేయరాదు.

21. నూతన వధువు అత్తవారింటికి పదహారురోజుల తర్వాత ప్రథమముగా గృహ ప్రవేసము జరుపవలసి వచ్చిన రాత్రి భాగము మంచిది. నూతన గృహప్రవేశము రాత్రి పగలు సమయమందు కూడ శుభము. ఏకోదరులకు ఉపనయన, వివాహములు : ఒక తల్లి బిడ్డలైన ఇద్దరు కుమారులకు ఒక సంవత్సరములో ఉపనయనములు గాని, వివాహములు గాని చేయరాదు. సంవత్సరము యొక్క పేరు మారిన శుభప్రదమగును. మొదట కుమారునకు ఉపనయనము చేసి తరువాత కుమార్తెకు వివాహము చేయవచ్చును. కుమార్తె వివాహానంతరము ఉపనయనము చేయవలసి వచ్చినచో ఆరుమాసముల వ్యత్యాసము ఉండవలెను. కుమారుని ఉపనయనము అయిన పిదప కుమారుని వివాహము తక్కువ వ్యవధిలో చేయవచ్చును. మరొక కుమారుని వివాహానంతరము ఉపనయనము చేయుటకు ఆరుమాసములు వ్యవధి ఉండవలెను. ఇరువురి కుమారులకు ఉపనయనము చేయవలెనన్నను ఇరువురి కుమార్తెలకు వివాహము చేయవలయునన్నను ఇరువురి కుమారులకు వివాహము చేయవలయునన్నను ఆరు మాసముల కాలవ్యవధి ఉండవలెను. ఈ నియమము కవల సంతానమునకు వర్తించదు. కుమార్తె వివాహానంతరము కుమారుని వివాహము చేయవచ్చును. కుమారుని వివాహము అయిన పిదప కుమార్తె వివాహము చేయవలయునన్న ఆరుమాసముల కాలవ్యవధి ఉండవలయును. ఫాల్గుణమాసమున కుమార్తె వివాహము చైత్రమాసమున కుమారుని ఉపనయనము సంవత్సర భేదముచే శుభప్రదముగా చేయవచ్చును.

1.కుజగ్రహము-అనుగ్రహము

1.కుజగ్రహము-అనుగ్రహము ప్రస్తుత సమాజమున వయసు వచ్చిన యువతీ యువకుల తల్లిదండ్రులు ఒక జ్యోతిష్కుని కలిసిన వెంటనే వారికి ఉండే సందేహము మొదటిగా మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి ఏమైనా కుజదోషము ఉందా? అనే

Read More »

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా

3.సంతానలేమికి – కుజగ్రహ ప్రభావమేనా సంతానము అంటే వెంటనే మొత్తం కుజగ్రహానికి లింకు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమోఅర్థంకావటంలేదు. నిజానికి కుజుడు ప్రస్తుత సమాజంలోపూర్తిచైతన్యవంతంగానే నడిపిస్తున్నాడు. పది సంవత్సరములు నిండని కుర్రవాడు ఆపోజిట్ సెక్సుతో  స్నేహం

Read More »

12.ముఖ్య జ్యోతిష విషయములు

12.ముఖ్య జ్యోతిష విషయములు 1. మాసము : శుక్లపక్షము, కృష్ణపక్షము అను రెండు పక్షములు కలదియు, ముప్పదిvతిథులు ఆత్మగా కల కాలమును మాసము అందురు. 2. సౌరమాసము : సూర్యుడు ఒకరాశి నుంచి మరియొక

Read More »