10.నిత్య దేవతార్చనచే – ప్రశాంత జీవనం

వైదికము, సనాతనము, ధర్మశాస్త్రము అనుసరించి స్వధర్మ ఆచరణ చేయుటయే భగవంతుని ఆరాధన. మనకి ఉన్న దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములను నిత్య కర్మలను ఆచరించుటద్వారా విముక్తులము అవగలము. స్నానము, సంధ్య, గాయత్రీ జపము, దేవతార్చన, వైశ్వదేవీ – బలి, స్వాధ్యాయము ఇత్యాది ఎవరు ఆచరించెదరో వారి బుద్ధి నిశ్చలతత్వమున ఉండగలదు. దానివలన సమతత్త్వము వివేకము ఏర్పడును. ప్రాతఃసంధ్య వలన రాత్రియందు చేసినపాపములు, సాయం సంధ్యవల్ల పగటియందు చేపిన పాపములు హరించును. ప్రతి నిత్యము జీవన సాగరములో మనము వాడుచున్న పనిముట్లద్వారా జీవ హింస జరుగుట తెలిసినదే. కాబట్టి ప్రతిరోజు వైశ్వదేవమును – బలిని, అతిథి పూజను, ఆవులకు మేత వేయుట, ప్రాణులపై దయ చూపుటచే పాపములు అంటవు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము అను పంచమహాయజ్ఞములు ఆచరించుటచే పాపవిముక్తి, ఋణ విముక్తి కలుగును.

1. స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞమే బ్రహ్మయజ్ఞము. పాఠమును ఆచరించుటవలన బ్రహ్మయజ్ఞముగా ప్రజాపతయే స్వాహా అను మంత్రముతో బలిని బ్రహ్మయజ్ఞము ఆచరించ వలెను.

2. దేవయజ్ఞము : మన అవసరాలు తీరుటకు సుఖసౌఖ్యములు పొందుటకు పశుపక్షి వృక్షాది లన్నింటిని మరియు అన్నము, జలము, ధాతువులు, ఫలపుష్పాదులను దేవతలు మనకొరకు సమకూర్చి ఉన్నారు. అట్టి దేవతలకు కృతజ్ఞతాభావముతో నివేదనలు అర్పించి వారికొరకై హోమము ఆచరించవలెను. ఈ దేవయజ్ఞము ద్వారా దేవతల ఋణమునుండి విముక్తిని పొందవచ్చును.

3. భూత యజ్ఞము : ధాత, విధాత మొదలగు భూతముల అధిష్టాన దేవతలకు అన్నము అర్పించటము మరియు క్రిమి కీటక, పతంగ, పశు, పక్ష్యాదులకై ఆహార పదార్థములను సమర్పించుటను భూత యజ్ఞముగా చెప్పబడినది.

4. పితృ యజ్ఞము : పితృదేవతలు తృప్తికొరకై స్వధా శబ్దమును చెప్పి అన్నమును, జలమును సమర్పించుటయే పితృయజ్ఞము అనబడును.

5. మనుష్య యజ్ఞము : అతిథులకు అన్నపానాదులను ఆదరభావముతో అందించి తృప్తి పరచుట, ఋషుల నిమిత్తము అన్నసమర్పణ చేయుటయే మనుష్య యజ్ఞము అనబడును. ఇట్లుకాక తనకొరకు మాత్రమే ఆహారము స్థిరపరచుకొనువాడు పొట్ట నింపుకొనిన, నింపుకొనినదంతను పాపముగనే జమ చేయబడును. తత్ఫలితముగా బుద్ధి వికటించి అతిచేష్టలకు లోబడి సుఖసౌఖ్యములకు నోచుకోక దుఃఖములకు దారితీయును. మన ఇష్టాఇష్టాలతో సంబంధము లేకుండా యాదృశ్చికంగా మనం చేసినా చేయక పోయినా పాపము పుణ్యము మనకు సంక్రమించవచ్చు. పుణ్యము ఐతే అనుభవిస్తాము అంటాము. పాపము ఎలా ఒప్పుకుంటాము అంటాము. ఇదే పెద్ద తంటా. మాకు తెలిసిన చదువుకున్న ఒకాయన ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. అనవసరంగా మాట్లాడడు, డబ్బు ఖర్చు పెట్టడు. కాని అందరూ వారిని పిసినారి అని దానం ధర్మం లేదు ఐనా వాడి జీవితమే బాగుంది అంటుంటారు. కాని ఆయనకి పెద్ద స్థలము, ఆ స్థలంలో చిదానంద కుటి ఉంది. వారి కుటుంబం అంతా సంతోషముతో ఉన్నారు. ఖాళీ స్థలములో రకరకాల వృక్ష సంపదని తన అవసర నిమిత్తము పెంచుకొంటున్నారు. కాయలు, పళ్లు, పువ్వులు, ఉదయం సాయంత్రం వేళల్లో పశుపక్ష్యాదులు తిని ఆనందానుభూతిని పొందుతున్నాయి. వాటికి గూడుగా కూడా వృక్షములు ఉన్నవి. వాటి ఆనందము అంతా వీరికి పుణ్యముగా జమ అవుతోంది. అలాగే చదువుకున్న వ్యక్తి గనుక నలుగురు విద్యార్థులకు తన కాలక్షేపం కోసం విద్య నేర్పేవాడు. దానివల్ల పుణ్యము లభించి వారి వంశములో అందరూ పెద్ద చదువులు చదివి అభివృద్ధి చెందారు. అంటే మనవల్ల ఇతరులకు మేలు కలిగిన వారు ఆనంద పడిన తిరిగి అది మనకు రెట్టింపు పుణ్య ఫలమై వస్తుందన్నమాట. ప్రత్యక్షంగా ఆయన ఏ ఉపకారము చేయకపోయినను కాలాన్ని వృధా చేయకుండా తనకోసం తనపని చేసుకుంటున్నా అనగా విధినిర్వహణలో బాధ్యతగా ఉండటంవల్ల కూడా పుణ్యఫలము లభిస్తోంది. తద్వారా ఆయన ఐశ్వర్యముతో ఉంటున్నారు. ఎవరో తెలిసినవాళ్లు మన ఇంటికి వచ్చి ఏదో వస్తువు మనకి ఉచితంగా ఇస్తారు. మనవాళ్లే కదా అని తీసికొంటాము. పొరపాటున అది ఇచ్చిన వారు అధర్మంగా సంపాదించినదైతే ఆ పాపము ఆ వస్తువు మనకు వచ్చినంత స్పీడుగానే రెట్టింపయి బ్రహ్మాండముగా ఉచితంగానే మనకు సంక్రమించవచ్చు. బయటకు వెళ్లి తినుబండారాలు తింటున్నాము. అవి వండేవాడు గాని వడ్డించేవాడు గాని దుష్టప్రవర్తన మరియు ఆలోచనలు కలవాడయినచో అక్కడ తిన్న ప్రతి అణువునుంచి పాపము మూట కట్టుకోవచ్చును. ఒక పండితుడు ఉదయమే తన గ్రామమునుంచి పనిమీద టౌను వెళ్ళాడు. మధ్యాహ్నానికి పని పూర్తికాలేదు. అసలే షుగరుంది, సాయంత్రందాకా ఉండాల్సినట్లుంది, ఇప్పుడు భోజనం ఎలా అని ఆలోచిస్తూ అక్కడ ఓ అగ్రహారంలో ఓ ఇంటికి వెళ్ళి విషయము చెప్పాడు. ఆ ఇంటావిడ ఇప్పుడే భోజనాలు అయిపోయాయి, మధ్యాహ్నం రెండుగంటలు అయిపోయింది అంది. మళ్లీ ఆ క్షణంలోనే ఏమనుకుందో వండి పెడతాను కూర్చుంటారా అంది. సరే అని పండితుడు కూర్చున్నాడు. ఇంటిఆమె వెండికంచము చెంబు మంచినీరు గ్లాసులో మంచినీరు పోసి ఆయనకోసం హాలులో పెట్టి న్యూస్ పేపరు కూడా ఇచ్చి లోపల వంట చేసుకొంటోంది. వండేటప్పుడు ఆవిడ బుర్ర వక్రించింది. ఆయనేమో ఇంట్లో లేరు. నేనేమో పండితునికి భోజనం పెడతానన్నాను, వెండి సామానులు కాస్తా బయట పెట్టాను అరటి ఆకు వేయవచ్చు కదా. అరటిఆకు చెట్టునుంచి కోయటానికి బద్ధకించాను, ఆయన పేపరు చదువుతున్నాడో లేక సామాను పుచ్చుకుని ఉడాయిస్తాడో ఏంచేస్తాడో ఈ రోజు నాకు ఈ తలనొప్పి ఏంటి? అని ఆలోచిస్తూ వంట వండుతోంది. వంట అయింది, వడ్డించింది, పండితుడు తిని చేతులు కడుగుకొని కూర్చున్నాడు. ఇంటావిడ లోపల గదిలో సామానులు సర్దుకుంటోంది. ఈ లోపుల పండితుడు వెండిసామానులతో ఉడాయించాడు. ఆవిడ వచ్చి హాలులో చూస్తే ఇంకేముంది, వీధి అంతా అల్లరి అయింది. రెండు నెలలు తరువాత పండితుడు మనింట్లో ఈ వెండి సామానులు ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకొన్నాడు. పండితుడు అగుటచే అసలు విషయము అర్ధమయింది. వెంటనే ఆ సామానులు పుచ్చుకుని ఆ యింటావిడకు ఇచ్చివేయటానికి బయలు దేరాడు. ఇంటి సమీపంలోకి చేరాడు. ఆ సమయంలో ఆడవాళ్లు ఫేమిలీ ఫ్రెండ్స్ చీటీ పాట ఆవిడ యింటి వద్ద రన్ అవుతోంది. ఆయన వస్తూండటము ఈవిడ చూసి అడుగో ఆ వస్తున్నాయనే దొంగ అని వారందరితో చెప్పింది. ఆయన ఇంటి సమీపంలోకి చేరిన వెంటనే ఆలోచించ కుండా అందరు మహిళలు ఆయనని చితక బాదారు. చల్లబడిన తరువాత ఆ యింటావిడతో పండితుడు అమ్మా, నువ్వు భోజనము పెట్టావు బాగానే ఉంది కాని వంట చేసేటప్పుడు నువ్వు నన్ను దొంగగా ఊహిస్తూ వండటం వల్ల అది తిని నేను బలైపోయాను. నాకు జ్ఞానోదయం అయింది కనుక నీకు నేను ఇచ్చివేయాలని సామానులు పుచ్చుకుని ఇప్పుడు మీకు అందచేయాలని తీసుకువచ్చాను. అని ఆవిడముందు ఉంచాడు. పూర్వకాలంలో అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, భగవంతుని ధ్యానము చేసుకుంటూ మౌనంగా వంట చేసుకునేవారు. దాన్ని బట్టి ఆనందంగా అందరూ రుచిగా కూడా ఎక్కువ మోతాదులో తినేవారు. ఇప్పుడు తినేవాళ్ళే లేరు. అంతా పారవేసేవాళ్లే. భోజనము మధ్యలో కూడా భగవన్నామ స్మరణ చేసేవారు. ఒక్క వంట విషయంలోనే కాదు ఆ వృత్తి ధర్మంతో ప్రతివ్యక్తి కేడరుతో సంబంధము లేకుండా అందరూ భగవన్నామ స్మరణతోటే పనిలో కూడా నిమగ్న మయ్యేవారు. దాని వల్ల ఆదమరపుగా ఉండకుండా పనికూడా షెడ్యూలు ప్రకారం సవ్యంగా జరిగేది. మనము తీసుకునే ఆహారమువల్లే ఎక్కువ దోషాలు అంటుతాయి. ఆ దోషాలు తప్పించుకోడానికే భగవన్నామ స్మరణ దేవతార్చన చేస్తున్నాము. అలాగే మన ఎదురుగుండానే మన పక్కింటి వారు అజ్ఞానంలోనో లేదా అహంకారంతోనో తప్పుడు పని చేస్తారు. తప్పుడు మాటలు మాటలాడతారు. మనకు జ్ఞానము ఉన్నట్లయిన ఆ పనిని ఖండించి చేయకుండా చెడు మాట్లాడకుండా మనము చూడాలి. అలా కానట్లయిన ఆ చెత్తపనిలో మనముకూడా పాలు పంచుకున్నట్లే. సందేహము లేదు. అలాగే ఈ మధ్య స్త్రీలమీద చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవారి వరకు ఎవరూ అనే అంశమే లేదు. విచక్షణ లేకుండా మానభంగములు జరుగుతున్నట్లు సమాచార వాణి చెబుతోంది. మరి ఈ పాపము ఎవరు మూట కట్టుకోవాలి? విన్న ప్రతివాడు మూట కట్టుకోవలసిందే. చూసిన ప్రతివాడు మూట కట్టుకోవాల్సిందే. అనాదిగా బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు స్త్రీ మూర్తికి రక్షణ ఇవ్వటం జరుగుతోంది. హిందూ సంస్కృతిలో స్త్రీ ఎప్పుడూ పైనే ఉంది. అగ్రముగనే ఉంది. ఉంటుంది. పురుషుని తరువాత అనేది సృష్టి ఉన్నంతవరకు జరుగదు. కనిపించిన అన్యాయాలను గురించి తక్కువగా ఊహించరాదు. ఇప్పుడు సమానత్వము అంటున్నారు. సమానత్వము అంటే తక్కువగా ఊహించుకున్నట్లే. సమానత్వమని బయటకు వెళ్లినప్పుడు తండ్రి, భర్త, పిల్లలు కూడా ఉండి రక్షించే అవకాశము ఉండదు. బయటకు వెళ్లిన తరువాత అది సమాజ బాధ్యత. సమాజమును నడిపించే గురువు, తదుపరి పరిపాలకులు మాత్రమే బాధ్యత. ఎక్కువ భాగము ఆదమరపుగా ఉన్న స్త్రీలు, గుడ్డిగా నమ్మే స్త్రీలు, పేదరికం వల్ల మరికొంతమంది, మరికొంత మంది అహంకారము అంధకారములో కూడా జీవితాలను పాడుచేసుకొంటున్నారు. సమాజంలో అందరూ మనలాగే ఉండమంటే ఉండరు. ఎవరి కేరక్టరు వారికి ఉంటుంది. అందుకని మనలాగనే ఉండే సమాజంలో మనము బ్రతకడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు రకరకాల పేర్లతో ఆర్గనైజేషన్స్ ఎంటర్టైన్ మెంట్స్ వచ్చేస్తున్నాయి. అవి ఏమిటోకూడ ఎవరికి తెలియక పోయిన ఏదో చూద్దామని స్త్రీలు కూడ వెళ్లటము జరుగుతోంది. ఆదమరపుగా ఉంటే సమాజం దానిపనిలో ఉంటుంది. మరి నష్టము కలిగించినవారు, నష్టపోయినవారు వారికి కలిగే బాధ పాపపుణ్యములకు ఎవరు బాధ్యత వహించాలి. ఎవరు అనుభవించాలి. సమాజం వల్ల జరిగింది గనుక సమాజంలో అందరూ పాపము పాలు పంచుకోవలసిందే. ఇప్పుడు అది స్వామీజీ ఏదో యాగం చేస్తున్నారంటే మనము చూడటానికి వెడుతున్నాము. ఎందుకని ఏదో పుణ్యము వస్తుందని. మరి ఇదికూడ మన ఎదురుకుండానే జరుగుతోంది కదా. మరి మంచైనా చెడైనా అంతేకదా. కుర్రవాడు తెలిసీతెలియని వయసులో దొంగపని చేస్తే వాడిమీద చర్య తీసుకోకుండా ఏదో చిన్నపిల్లవాడు అని వదిలేస్తే పొరపాటున వాడు గజదొంగగా మారినట్లయిన తల్లిదండ్రులు వారికి సరియైన మార్గనిర్దేశము చెయ్యలేదు కనుక వాడు చేసే పాపపు పనులు అన్నిటిభాగం వంశములో అందరూ అనుభవించాల్సిందే. ఇక్కడ వంశంలో అందరూ అంటే వాడు దొంగరా అంటే ఫలానా వాళ్ల అబ్బాయి అంటాము. ఫలానా వాడి తమ్ముడురా అంటారు. ఫలానా వాడి మేనళ్లుడురా అంటారు. అంటే అందరికి వర్తిస్తోందికదా. తప్పదు మరి. ఇలాంటి పరిస్థితులనుంచి తప్పించుకోటానికి అనేక వ్రతాలు ఉన్నాయి. కాని కాలమాన పరిస్థితులలో ఆచరించలేకపోతున్నాము. పశుపక్ష్యాదులు ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. మానవులు ఆచరించకలిగి ఆచరించక నరక యాతన పడుతున్నారు. దీనికి కారణమేమిటి? సద్గురువుని ఆశ్రయించకపోవుట ప్రజలపై రాజు పరిరక్షణ సరిగా లేకపోవుట. ఇవి రెండూ ఎంచుకొనుట మన చేతులలోనే ఉంటుంది. ఉంటే ఈ పరిస్థితి ఎందుకు. అజ్ఞానంలో సద్గురువుని ఆశ్రయించకపోవటము, అజ్ఞానములో సరియైన రాజుని ఎంచుకోకపోవటము జరుగుతోంది. జ్ఞానోదయము అయ్యేవరకు ఈ సమస్యలు తప్పవు. మరి జ్ఞానోదయము అయ్యేది ఎలా. మనము చేసే నిత్యకర్మలద్వారా పంచయజ్ఞములను ఆచరించుట వలన దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణములనుండి విముక్తి కలుగుట, సద్గురువుని ఆశ్రయించుటవల్ల ధర్మాధర్మ విచక్షణ నెరిగి కుటుంబానికి సంఘానికి దేశానికి మేలు జరగటము మనము చేసే నిత్య దేవతార్చనలో మంత్ర ధ్వని తరంగ ప్రభావము వలన మనలో ఉన్న వికారములు హరించి వేయబడి సమాజంలో నుండి మనమీద పడే దుష్ట ప్రభావములు మనమీద పడకుండా హరించవేయబడి నిర్మల హృదయాన్ని మంచి సంస్కారాన్ని విధి నిర్వహణలో సరియైన నిర్ణయాలని తీసుకునే శక్తి పొందటము తద్వారా జీవన సాగరము ప్రశాంతమయం అవుతుంది అనుటలో సందేహము లేదు.

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా

4.పరిణయానికి వధూవర పొంతనే ప్రధానమా ప్రస్తుత సమాజములో పంచాగమునందు చూపబడిన వధూవర గుణమేళన చక్రప్రకారము ఎవరికి వారు చూసుకుని 18 పాయింట్లు తగ్గితే వచ్చిన సంబంధం వదులుకుని 18 పాయింట్సుకి పెరిగితే వారే కన్ఫార్మ్

Read More »

11.దేవాలయమున అర్చకుడు – భక్తుడు

11.దేవాలయమున అర్చకుడు – భక్తుడు భగవంతునికి – భక్తునికి మధ్య అనుసంధానమే దీక్ష పొందిన అర్చకుడు. అర్చకుని సంస్కారమువల్ల అర్చనలో విశిష్టత వల్ల ప్రతిమా రూపమువల్ల ఆలయములో భగవంతుడు సన్నిహితుడు అవుతాడు. శిల్పి చెక్కిన

Read More »

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము

9.ఇక్కడ మనకు ఉన్నవే – స్వర్గము, నరకము తోటి మనిషితో ఎట్లా ప్రవర్తించాలి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవటము, ఇంటికి వచ్చిన అతిథులతో గౌరవించుకొనటము, మంచి సాంప్రదాయ సంస్కారములతో బ్రతుకు వెళ్లబుచ్చటము, ఇతరులకి ఇష్టములేని పని

Read More »